విశ్వాసములో సంపూర్ణ నిశ్చయతలో - పరలోక వారసులము | Heb 10:19-23 | Telugu Audio Sermon Series

విశ్వాసములో సంపూర్ణ నిశ్చయతలో – పరలోక వారసులము | Heb 10:19-23 | Telugu Audio Sermon Seriesహెబ్రీ 10:19-23 విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

ఆదికాండం నుండి ప్రకటన వరకు ప్రతి గ్రంథములో క్రీస్తు కనిపిస్తాడు, కనిపించిన ప్రతి చోట మన కొరకే కనిపిస్తాడు. సృష్ఠి ఎవరి కొరకు? మానవుని కొరకే. పరలోకం ఎవరి కొరకు? మానవుని కొరకే. దేవుడు మానవునిగా రావాడానికి కారణం, మరణించి తిరిగిలేచుటకు కారణం, మరల రెండవసారి వచ్చుటకు కారణం మనిషి కొరకే. దేవుడు మనిషికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇప్పుడు ఈ సమయంలో దేవుడేమి చేస్తున్నాడని ప్రశ్న వేసుకుంటే; నిస్సందేహంగా నాగురించే ఆలోచిస్తున్నాడని ధైర్యంగా చెప్పొచ్చు. తనను నమ్మినవారి కొరకు స్థలము సిద్ధపరచుచున్నాడు. మన కొరకు పని చేస్తున్నాడు, మన కొరకు ఎదురు చూస్తున్నాడు.

పరిశుద్ధ గ్రంథములోని వాక్యములన్ని మనలను పరిపూర్ణులుగా చేసి పరలోకం చేర్చుటకే.

– రోమా 8:17 మనము దేవుని వారసులము
– 1 కొరింథీ 3:16 మనము దేవుని ఆలయమైయున్నాము
– ఎఫెసీ 1:3 మనము ఆశీర్వాదించబడినవారము
– ఎఫెసీ 2:15 మనము నూతన పురుషులము (సృష్ఠి)
– ఎఫెసీ 5:1 మనము ప్రియమైన పిల్లలు
– 1 పేతురు 2:10 మనము దేవుని ప్రజలము

ఆదికాండము నుండి ప్రకటన వరకు అనేకమైన పరిస్థితులను మనం చూస్తాము కాని, చివరకు వచ్చే సరికి ఒకటే మాట ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది ( ప్రకటన 21:3). ఈ వాక్యభాగంలో మనలను దేవుడు ఎంత ప్రత్యేకముగా చూస్తున్నాడో గమనించాలి. మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనేది దేవుని ఆకాంక్ష. మనతో కలిసి ఉండుటకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. రక్తశ్రావముగల స్త్రీ స్వస్థత కొరకు వెనక నుండి దేవుని వస్త్రపు చెంగు పట్టుకంది. కనాను స్త్రీ తన కుమార్తె స్వస్థత కొరకు దేవుని బ్రతిమిలాడి కుక్కతో పోల్చుకున్నది. సమరయ స్త్రీ అంటరాని దాననని దూరముగా ఉన్నది. కుష్ఠ వ్యాధిగలవారు స్వస్థత కొరకు దూరము నుండి కేకలు వేసారు. కాని, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడిన మనము దేవుని వారసులము, పరలోక సంబంధులము. దూరము నుండి కేకలు వేయవలసిన అవసరంలేదు, దాగుకొనవలసిన అవసరంలేదు మనకు కావలసినవి అధికారంతో అడిగి తీసుకొనే అర్హత మనకున్నది; ఆ అధికారం దేవుడే మనకిచ్చాడు.

(కొలస్సి 3:1-10) మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ లోకం చెత్తతో పోల్చబడినది. రక్షించబడిన మనము లోకములోని చెత్త ఏరుకోవద్దు అనగా శరీరాశ నేత్రాశ జీవపుడంబము అనే చెత్త కాదు పరలోకములోని ఉన్నతమైన వాటిని కోరుకో, వాటికి నీవు అర్హుడివని అర్థం. మనము ఈ లోక సంబంధుము కాదు పరలోక సంబంధులము, పరలోకవారసులమని గ్రహించి విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

Rev Anil Andrewz
Sajeeva Vahini, India
+918898318318
http://www.sajeevavahini.com/
background music from bensound.com

#sajeevavahini #telugubibledevotions #teluguchristian #christianaudio #telugubible

source